నోట్ల రద్దు నష్టాన్ని తేల్చిచెబుతున్న తాజా జీడీపీ లెక్కలు

        కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30 అంటే నిన్న జీడీపీ గణాంకాలను వెల్లడించింది. ఈ నేపథ్యంలో అసలు జీడీపీ అంటే ఏంటి? దాని ఎలా లెక్కిస్తారు? నిన్న ప్రకటించిన జీడీపీ గణాంకాలతో డొల్లతనం ఏంటీ? ఇప్పుడు తెలుసుకుందాం…

        ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో తయారైన అంతిమ వస్తు సేవల విలువ మొత్తాన్ని డబ్బు రూపంలో  విలువ కడితే దానిని జీడీపీ (స్థూల దేశీయ ఉత్పత్తి) అంటారు.
     మన దేశం యొక్క ఆర్ధిక వ్యవస్థ మూడు రంగాల మీద ఆధారపడి ఉంది.

 1.  ప్రాథమిక రంగం. ఇందులో మళ్ళీ అనుబంధ రంగాలు.
 • వ్యవసాయం
 • మత్స్య పెంపకం 
 • అడవులు

    2. ద్వితీయ రంగం. ఇందులో మళ్ళీ అనుబంధ రంగాలు.

 • తయారీ రంగం 
 • నిర్మాణ రంగం 
 • గనులు, తవ్వకాలు 
 • పరిశ్రమలు

    3. సేవా రంగం

 • విధ్యుత్ ఛక్తి 
 • నీటి సరఫరా 
 • బ్యాంకింగ్
 • ఇంధనం
 • ఇన్సూరెన్స్ 
 • ఐటీ 
 • భీమా లాంటి మొత్తం 17 ఉప రంగాలు ఉంటాయి. 

    ఈ మొత్తం రంగాలలో జరిగిన ఉత్పత్తిని లెక్కించడమే జీడీపీ.
     ఇందులో ప్రాధమిక రంగం నుండి మొత్తం జీడీపి లో 17.32% , ద్వితీయ రంగం నుండీ 29.2% , సేవా రంగం నుండీ అత్యధికంగా 53.66% ఆదాయం లభిస్తుంది.
   ఇక ఉపాది పరంగా ప్రాధమిక రంగం అత్యధికంగా 48% , పారిశ్రామిక రంగం మరియు సేవల రంగం వరసగా 24% , 28% లేబర్ ఫోర్స్ ని కలిగి ఉన్నాయి. అంటే ఇప్పటికీ వ్యవసాయ రంగమే అత్యధిక ఉపాది ఇస్తోంది.
     అయితే కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన జీడీపి గణాంకాలు పరిశీలించే ముందు 2014 నుండి జీడీపిలో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయో ఒకసారి పరిశీలిద్దాం.

2014లో నరేంద్రమోదీ అధికారం లోకి వచ్చే సరికి భారత ఆర్ధిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తూ ముందుకు వెళుతుంది.

  ఈ నేపధ్యంలో జీడీపి వృద్ది రేటు 2014-15 మొదటి, రెండు, మూడు, నాలుగు త్రైమాసిక ఫలితాలు ముగిసే నాటికీ వరసగా జీడీపి వృద్ది రేటు 6.4%, 8.4%, 6.6%, 7.5% గా నమోదు కాగా 2015-16 లో మొదటి, రెండు, మూడు, నాలుగు త్రైమాసిక ఫలితాల నాటికీ వరసగా జీడీపి 7.5% 7.6% 7.2% 7.9% తో అత్యధిక వృద్దిరేటును కలిగి ఉంది.
     అలాగే 2016-17లో భారత జీడీపి మొదటి నుండి నలుగు త్రైమాసిక ఫలితాలు ముగిసే నాటికీ వరసగా 7.9% 7.5% 7% 6.1% గా నమోదు అయింది. 2016 నోట్ల రద్దు నేపథ్యంలో నాలుగవ త్రైమాసిక ఫలితం నాటికీ 6.1% వృద్ది తో ఆర్ధిక వ్యవస్త మంద గమనాన్ని గమనించవచ్చు. 
     ఇక 2016 చివరి బాగంలో తీసుకున్నా నోట్ల రద్దు నిర్ణయం నేపధ్యంలో 2017- 18 జీడీపి గణాంకాలు పరిశీలిస్తే మొదటి త్రైమాసిక ఫలితం నాటికి భారత ఆర్ధిక వ్యవస్త మూడేళ్ళ కనిష్టానికి దిగజారి 5.7% వృద్ధిని నమోదు చేసి భారత ఆర్ధిక వ్యవస్థ పతనానికి బాటలు వేసింది.
  ఇక నిన్న ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాలు చూస్తే 6.3% స్వల్ప వృద్ధిని నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే కాలంలో  7.5% వృద్ది ఉందని గమనించాలి. ఈ 6.3% వృద్ది కూడా గనులు తయారీ రంగంలో వృద్ది వల్లే సాధ్యం అయింది.

      భారత ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముక అత్యధిక ఉపాది కలిపించే వ్యవసాయ రంగంలో కేవలం అతి తక్కువ 1.7% వృద్ధిని నమోదు చేసింది. నోట్ల రద్దు ప్రభావం వల్ల రుతుపవనాలు అనుకూలంగా ఉన్న ఈ రంగంలో వృద్ది కనిపించలేదు.
   అదే విధంగా 2017 అక్టోబర్ నాటికి దేశంలో 8 కీలకం అయిన ఉక్కు, సిమెంట్, ఇంధనం లాంటి రంగాలలో వృద్ది 4.7% పడిపోయింది ఆర్ధిక వ్యవస్థ కు ఈ 8 రంగాలు చొధకాలు. కానీ వీటి వృద్ది రేటు మాత్రం క్షిణించిపోవడం గమనార్హం.
     దేశంలో అసంఘటిత రంగంలో అత్యధిక ఉపాధి కల్పిస్తున్న నిర్మాణ రంగంలో సాధించిన వృద్ది 2.6% మాత్రమే. నోట్ల రద్దు ప్రభావానికి అత్యధికంగా గురి అయింది ఈ రంగమే.
   ఇక ద్రవ్య లోటు విషయానికి వస్తే అక్టోబర్ చివరి నాటికీ బడ్జెట్ అంచనాలతో ద్రవ్యలోటు  96.1% చేరి వణుకు పుట్టిస్తుంది.

     ద్రవ్యలోటు అనగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ప్రభుత్వం చేసే వ్యయం ఎక్కువగా ఉండటాన్ని ద్రవ్య లోటు అంటాం.  ప్రభుత్వ వ్యయాలు పెరిగి ఆదాయాలు తగ్గడం ఇందుకు ముఖ్యమైన కారణం.
నోట్ల రద్దు, GST,  Online transfers వల్ల టాక్స్ చెల్లించే వారి శాతం పెరిగి ప్రభుత్వానికి విచ్చల విడిగా ఆదాయం వస్తుందని చేసిన ప్రకటనలను, పెరిగిన ద్రవ్య లోటు పటాపంచలు చేసింది. అంతా బూటకం అని తేల్చింది.
       ఆదాయ వ్యయాల మధ్య తేడా ఏప్రిల్ – అక్టోబర్ నాటికీ 5.25 లక్షల కోట్లుగా భారీ వ్యత్యాసం నమోదయింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ప్రభుత్వం 15.15 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే ఇప్పటి వరకు 7.29 లక్షల కోట్లు అంటే బడ్జెట్ లో అంచనా వేసిన దాంట్లో 48.1% గా నమోదు అయింది.
ఇక ప్రభుత్వ వ్యయం విషయానికి వస్తే అక్టోబర్ చివరి నాటికీ 12.92 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇది భారీ ద్రవ్య లోటుకు దారి తీసింది.
     ఇన్ని లొసుగులతో ఉన్న ఆర్ధిక వ్యవస్థను పట్టించుకోకుండా కేవలం 5.7% నుండి 6.3% స్వల్ప వృద్ది నమోదు చేసిన జీడీపిని ఆసరాగా చేసుకుని ఆర్ధిక వ్యవస్థకు డోకా లేదని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది.

    నోట్ల రద్దు వల్ల జరిగిన నష్టాన్ని గుర్తించకుండా భవిష్యత్ లో లాభాలు ఉంటాయని ప్రచారం చేస్తున్నారు. పోనీ ఆ లాభాలు ఏంటి అని అడిగితే సమాధానం ఇవ్వకుండా, అవి ఎలా వస్తాయో చెప్పకుండా, తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి భజన సంఘాలు వంత పాడటం దురదృష్టకరం.
      అసంఘటిత రంగంలో ఉపాధి ఇంకా మెరుగు పడలేదు. వ్యవసాయ రంగం గాడిలో లేదు. ద్రవ్య లోటు  ఎంత మాత్రం అదుపులో లేదు. నోట్ల రద్దు, అస్తవ్యస్తమైన GST  సంస్కరణలు చేపట్టి ఉండకపోతే ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం కొనసాగి ఉండేది.
       రుతుపవనాలు అనుకూలంగా ఉన్న సమయంలో వ్యవసాయ రంగాన్నీ ఆదుకోవాలి, అలాగే అసంఘటిత రంగ కార్మికులకు అనుకూలంగా ఆర్ధిక సంస్కరణలు కొనసాగాలి.
        ద్రవ్య లోటు కట్టడికి ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకునేలా  GST ని సవరించి ప్రభుత్వ అనవసర వ్యయాలు తగ్గించుకోవాలి. అప్పుడే ఆర్ధిక వ్యవస్థ గాడిలో పడుతుంది.

Advertisements

రైతు సమన్వయ సమితుల పేరుతో …….టీఆర్ఎస్ గ్రామ కమిటీలు

       తను చేసే తప్పులకు కూడా ఓ సైద్ధాంతిక సూత్రీకరణ చేసి, నిజమేనని ఒప్పుకొండి అని దబాయించడంలో కేసీయార్‌‌ను మించినవాళ్లు లేరు… రాజకీయాల్లో గడుసుతనం అవసరమే కానీ ‘బరాబర్ ఇట్లనే చేస్త…’ అంటూ సాగించే వింత వాదాలకు సమాజం సంపూర్ణ ఆమోదం ఉంటుందని అనుకోవడం కూడా కరెక్టు కాదు… ఇతర పార్టీల నుంచి ఎన్నికైన వారిని ఎడాపెడా లాగేసి, దానికి రాజకీయ పునరేకీకరణ అని పేరు పెడతాడు.

         నిజాం భజన చేస్తూ, ఏం..? కాటన్‌కన్నా గొప్ప కాదా అని ఢంకా బజాయిస్తాడు… సేమ్, రైతు సమన్వయ సమితులపైనా అదే వాదన… వీటి ఏర్పాటుతో కేసీయార్ ఆశించే లక్ష్యాలు బహుముఖం…..

       రైతు ప్రభుత్వంగా చెప్పుకోవటానికి ఎకరానికి 8 వేల ఇన్‌పుట్ సాయం అందులో ఒకటి కాగా… గ్రామ స్థాయి దాకా పార్టీ బలాన్ని పెంచుకుని, పార్టీ యంత్రాంగాన్ని మూలమూలలకూ ‘సంస్థాగతంగా’ విస్తరించుకోవడం మరో లక్ష్యo.

          ‘వాటికి అధికారాలు ఉండవు, కేవలం బాధ్యతలే ఉంటాయి, రైతులు-వ్యాపారులు-ప్రభుత్వం నడుమ సమన్వయం కోసమే’ అని పైకి చెబుతున్నా, రైతు పండించిన పంటపై, ధరపై, భూవివాదాలపై వాటి పెత్తనం పెరిగితే… వాటిపై రాను రాను సమాజం నుంచి ఏరకమైన స్పందన కనిపిస్తుందో వేచిచూడాల్సిందే.

         నిస్తేజంగా, నిష్క్రియాపరంగా మారిపోయిన విపక్షాలు ప్లస్ మీడియా పుణ్యమాని కేసీయార్ వాదనలకు ప్రతివాదనలు (కౌంటర్) సరిగ్గా వినిపించకుండా పోయింది.

వాటి గురించి కొన్ని అంశాలు…
►   బరాబర్ మా టీఆర్ఎస్ వాళ్లకే ఈ సమితుల్లో చోటు అని అసెంబ్లీ సాక్షిగా కేసీయార్ గారు చేసిన ప్రకటన… ప్రభుత్వంలో ఉన్న పార్టీ తన వాళ్లకు గ్రామస్థాయి దాకా ఏవో పోస్టులు ఇచ్చి, సంతృప్తి పరిచేందుకు ఇది ఉపయోగపడుతుంది.
►  ప్రభుత్వం తన పార్టీ వాళ్లనే అందులో చేర్పిస్తుందనేది ఊహించేదే… అయితే దానికి సూత్రీకరణ వితండవాదంలా ఉన్నది… తెలంగాణ కోసం 14 ఏళ్లుగా పోరాడుతున్న తమ పార్టీ వాళ్లకే ఆ అర్హత ఉందనీ, అందుకే మేమే సమితుల్లో ఉంటాం, తప్పేమిటీ అనేది కేసీయార్ వాదన… కేసీయార్ దీక్ష, తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం ప్రకటన, వెనుకంజ, పోటీగా సమైక్య ఉద్యమం ప్రారంభమైన తరువాత తెలంగాణ సాకారం అయ్యేవరకూ కేవలం టీఆర్ఎస్ వాళ్లే పోరాడారా..? ఒక్క సీపీఎం మినహా అన్ని పార్టీలూ ఊరూరా, కులాల వారీగా, వృత్తుల వారీగా జేయేసీలు ఏర్పడి మరీ పోరాడారు కదా… పార్టీలకు అతీతంగా ఉద్యమం ఉవ్వెత్తున జరిగింది కదా… నిజానికి సీపీఎం పూర్తి వ్యతిరేకంగా ఉండగా, కేసీయార్ అమితంగా ప్రేమిస్తున్న మజ్లిస్ కూడా రాయల తెలంగాణ వంటికి మద్దతు పలికిందే తప్ప తెలంగాణ పోరాటంలో మనస్పూర్తిగా ఏమీ పోరాడింది లేదు… టీడీపీ అర్ధమనస్కంగా, ఉండీ లేనట్టు, చేసే చేయనట్టు, రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణపాట పాడింది… వాటిని వదిలేస్తే బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, న్యూడెమోక్రసీ వంటి పార్టీల కార్యకర్తలు తెలంగాణ పోరాటంలో ఉన్నవాళ్లే కదా… 

► నిజంగా తెలంగాణ కోసం పోరాడటమే రైతు సమన్వయ సమితుల్లో చోటుకు అర్హత అయ్యే పక్షంలో మరి ఆయా పార్టీల వాళ్లు ఎందుకు దూరమవ్వాలి..? పైగా తెలంగాణ కోసం పోరాడటం ఒక్కటే అర్హత ఎలా అవుతుంది..? 

►  56 లక్షల మంది రైతులు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారని చెబుతున్న కేసీయార్ ధీమాగా, ప్రజాస్వామికంగా, ధైర్యంగా, స్పూర్తిదాయకంగా వీటికి ఎన్నికలు ఎందుకు పెట్టకూడదు..? రాబోయే ఎంపీటీసీ, సర్పంచి ఎన్నికలకు దీన్ని ఓ రిహార్సల్‌గా ఎందుకు తీసుకోకూడదు..? అలా చేస్తే దేశానికే ఓ ఆదర్శ నాయకుడిగా కీర్తి కూడా వచ్చేది కదా..?

►  కౌలు రైతులకు ఇన్‌పుట్ సాయం ఇచ్చే వీలు లేదని బ్లంట్ జవాబు ఒకటి కేసీయార్ నోటి వెంట వచ్చింది… నిజానికి 45 శాతం రైతులు కౌలుదార్లేనని విపక్షాలు చెబుతున్నాయి… మరి నిజంగా పెట్టుబడులు పెట్టి, కాయకష్టం చేసి, రిస్క్ తీసుకుని, కౌలు కూడా చెల్లిస్తూ మరీ వ్యవసాయం చేసే నిజమైన రైతుకు ప్రభుత్వసాయం ఉపయోగపడాలా..? లేక కేవలం భూమి వాళ్ల పేర్లపై ఉంది కాబట్టి, తాము పొలంలోకి దిగకపోయినా భూయజమానులు ప్రభుత్వసాయం పొందాలా..? ఇదెక్కడి న్యాయం..? ఇది సామాజిక న్యాయం అవుతుందా..? పోనీ, సహజన్యాయం అయినా అవుతుందా..?
►  పట్టాదారు పాసుపుస్తకాలపై కేసీయార్ ఫోటోపైనా ఓ వివాదం ఉంది… ప్రభుత్వం అనేది ఓ నిరంతర ప్రక్రియ… ఈరోజు టీఆర్ఎస్ ఉండొచ్చు, రేపు మరొకరు రావచ్చు… పైపైన స్థూలంగా ఆలోచిస్తే ఈరోజు ముఖ్యమంత్రిగా తన ఫోటో వాడటంలో తప్పు కనిపించదు కానీ కొన్ని ఏళ్లపాటు రైతుకు తన యాజమాన్య హక్కులపై ధీమా కల్పించాల్సిన అధికారిక పత్రాలపై సీఎం ఫోటో ఎందుకు..? పొరపాటున రేప్పొద్దున ఎన్నికల్లో ఇంకెవరో సీఎం అయితే మళ్లీ కొత్త సీఎం ఫోటోతో పాసుపుస్తకాలు ఇస్తారా..? ఇదెక్కడి ఆనవాయితీని ప్రవేశపెడుతున్నట్టు..?

►  గ్రామ స్థాయి, మండల స్థాయి రైతు సమితులకు అధికారాలు లేకపోవచ్చు… కానీ రాష్ట్ర స్థాయిలో దీన్ని ఓ కార్పొరేషన్ చేస్తామనీ, వందల కోట్లను సీడ్ మనీ ఇస్తామని, అవసరమైతే పంటల్ని తను కొనుగోలు చేస్తుందనీ కేసీయారే చెబుతున్నాడు… మంచిదే… ఇప్పుడు ధాన్యం, మక్కలు, …. కొనుగోలు చేస్తున్న ఐకేపీ కమిటీలు ఏమైపోతాయి..? 

►  మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ వంటి సంస్థల గతి ఏమిటి..? మూసేస్తారా..? 

► . ప్రభుత్వ ధనాన్ని సమకూరుస్తారు కాబట్టి సదరు కాార్పొరేషన్‌కు జరిగే పొలిటికల్ నామినేషన్లు చట్టపరంగా నిలుస్తాయా..? ‘‘పార్టీ కమిటీ’’లకు ప్రభుత్వ ధనంతో అప్పగించే అధికారాల్ని చట్టం అంగీకరిస్తుందా..? 

                 ఇన్ని అంశాలపై తెలంగాణ సమాజంలో నిర్మాణాత్మక చర్చ జరిగితే బాగుంటుంది

రిజర్వేషన్లు పరిష్కారం కాదు, పరిహారం మాత్రమే : అల్లేని నిఖిల్

రిజర్వేషన్లు పరిష్కారం కాదు, పరిహారం మాత్రమే అని  అల్లేని నిఖిల్ అన్నారు.హైదరాబాద్ హిమాయత్ నగర్ లో  రిజర్వేషన్లపై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు.

                 ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల పేరుతో కులాల కుంపటి పెట్టి సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేయవద్దని అన్నారు.స్వాతంత్ర్యం వచ్చి ఏడు(7) దశాబ్దాలు గడుస్తున్నా అణగారిన వర్గాల వారి స్థితిగతులు పెద్దగా మారింది లేదని, ముఖ్యంగా కొన్ని కులాల వారు, ఆదివాసీలు ఈనాటికీ వారికి లభించిన కోటాను సంపూర్ణంగా వినియోగించుకోలేని స్థితిలో ఉన్నారన్నారు.

రిజర్వేషన్ల సమస్య పరిష్కారానికి రెండు శాశ్వత పరిష్కార ప్రతిపాదనలు చేస్తున్నానని నిఖిల్ అన్నారు.

 1. అణగారిన వర్గాల్లోని పేద పిల్లలకు ఎంపిక పరీక్షలలో అదనంగా కొంతవరకు మార్కులు కలపాలి.ఈ మార్కుల వెయిటేజీకి ఆ పిల్లలు చదివే స్కూల్, తల్లిదండ్రుల ఆర్థిక స్థోమత, విద్యార్హత వంటివి పరిగణలోకి తీసుకోవచ్చు.
 2.  అణగారిన వర్గాల పిల్లలు ప్రభుత్వ/ ప్రైవేట్/ కార్పొరేట్ వంటి తేడా లేకుండా ఎవరు ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నా, ఉచితంగా విద్యనందించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకొని, ఎంత ఉన్నత విద్యాకైనా పూర్తి తోడ్పాటును అందించాలి.

ఈ రెండు పరిష్కార మార్గాలను అణగారిన వర్గాలతో పాటు, అగ్రకులాలలోని పేదవారికి కూడా వర్తింపజేస్తే రానున్న కొన్ని సంవత్సరాల తరువాత రిజర్వేషన్ల అవసరం ఉండదని నిఖిల్ అన్నారు.

           దీనికోసం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలను ప్రక్కనపెట్టి ప్రజల ప్రయోజనాల గురించి ఆలోచించాలని ఆయన సూచించారు.ఈ ప్రతిపాదనల్లో అవసరమయితే కొన్ని మార్పులు చేయవచ్చని, కానీ ఒక ప్రత్యామ్నాయ పరిష్కారంతో కూడిన రిజర్వేషన్ల సంస్కరణలను అమలు చేయడం మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరమని నిఖిల్ అన్నారు.వీటికి రాజ్యాంగ సవరణ వంటి సంక్లిష్ట ప్రక్రియలు కూడా అవసరం లేదన్నారు.

 • వీటితో పాటు రిజర్వేషన్ల కులాలలో కూడా నిజమైన అర్హులకు అవకాశాలు అందించేందుకు మరొక సంస్కరణ చెప్పట్టాలని ఆయన సూచించారు.క్రిమిలయేర్ ను అమలు చేసి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు,IAS,IPS లు, డాక్టర్లు మరియు సంపన్న వర్గాలను రిజర్వేషన్ల పరిధి నుండి తప్పించాలని ఆయన అన్నారు. ఇలా చేస్తే రిజర్వేషన్లు పొందుతున్న కులాలలో అడుగున ఉన్న లక్షలాది మంది అర్హులు అవకాశాల్ని అందుకోవడంతో పాటుగా క్రమంగా రిజర్వేషన్ల అవసరం లేకుండానే పేదరికం నుండి బయటపడగలుగుతారని నిఖిల్ అన్నారు.
 • కాబట్టి ప్రభుత్వం ఈ సంస్కరణలపై అందరిని కలుపుకొని చర్చించి అమలు చేయాలని కోరారు. వీటిని అమలు చేయడం వల్ల దేశంలోని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి, మరియు దేశమంతటికీ రిజర్వేషన్ల సంస్కరణలపై దారి చూపేందుకు ఇది గొప్ప అవకాశమని, తెలంగాణ రాష్ట్రం ఒక గొప్ప ఆదర్శప్రాయమైన నమూనాను దేశానికి అందించినట్లు అవుతుందని నిఖిల్ అన్నారు.

బీసీ రిజర్వేషన్లే కేసీయార్‌కు ఎదురుకాబోయే అసలు చిక్కు..!! : నిఖిల్ అల్లేని

జనాభా ప్రాతిపదికన, అందరికీ రిజర్వేషన్లు ఇచ్చేస్తే ఇక రిజర్వేషన్లు అనే స్ఫూర్తి ఎక్కడిది..? నిజంగా సామాజికంగా వెనుకబాటుతనంలో ఉన్నవారిని ఉద్ధరించాలంటే రాజకీయ రిజర్వేషన్లు కావాలి… అవిచ్చే స్ఫూర్తి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి పదవుల్లో ఇవే శాతం రిజర్వేషన్లు పాటిస్తారా…… ఇదీ మేధావివర్గం ప్రశ్న… కాసేపు వదిలేయండి

ముస్లిం రిజర్వేషన్లు అని మేనిఫెస్టోలోనే పెట్టారు, 170 సభల్లోనూ అదే చెప్పానంటున్నారు… మళ్లీ ఇవి మతపరమైన రిజర్వేషన్లు కావంటారు… ఉన్నవాటినే పెంచుతున్నామంటారు… ఇదేమి తర్కం..? పైగా ఇది రాజ్యాంగవిరుద్ధం……. ఇదీ బీజేపీ విమర్శ… కాసేపు వదిలేయండి
ముస్లిములకు, గిరిజనులకు వాళ్ల జనాభాను బట్టి రిజర్వేషన్లు పెంచుతున్నావు సరే… మరిన్నాళ్లూ ఏం చేశావు..? వోకే, పనిలోపనిగా బీసీలకు కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల బిల్లు ఎందుకు పెట్టలేదు..? యమర్జెంటుగా సుధీర్ కమిషన్, బీసీ కమిషన్ రిపోర్టులను తెప్పించి, వాటిని ముందే బయట పెట్టకుండా అప్పటికప్పుడు ఆమోదించి, రిజర్వేషన్ల బిల్లు పెట్టావు… మరి బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ఆ వేగం, స్పీడ్ ఎందుకు లేవు..? ఆ మిస్టరీ ఏంటి..?….. ఇదీ కాంగ్రెస్ ఎదురుదాడి… కాసేపు వదిలేయండి
అణగదొక్కబడిన వర్గాలకు రిజర్వేషన్లతో చేయూతనిస్తే, అభినందించాల్సిందిపోయి, ముందే అడ్డం పడతారా..? ఇదెక్కడి చోద్యం..?……. ఇదీ టీఆర్ఎస్ వర్గాల సమర్థన… కాసేపు వదిలేయండి
సుప్రీం కోర్టు ఆల్రెడీ 50 శాతం గరిష్ట పరిమితి పెట్టేసింది… కేంద్రమూ ఒప్పుకోదు… కోర్టుల్లో నిలవదని తెలిసీ ఈ ప్రయత్నాలు కేవలం రాజకీయ లబ్ధి కోసం గాక ఇంకెందుకు..? ఇన్నాళ్లూ లేని దృష్టి ఇప్పుడు ఎందుకు అకస్మాత్తుగా ఈ గిరిజన, ముస్లిం రిజర్వేషన్లపై పడింది..?….. ఇదీ విశ్లేషకులు కొందరి మాట… కాసేపు వదిలేయండి
……….. దీనివల్ల కేసీయార్ కలిగే రాజకీయలబ్ధి ఏమిటీ..? ప్రజల్లో స్పందన ఎలా ఉంది… అని కొద్దిరోజులాగా కేసీయార్ సర్వే చేయించుకుంటే అదే తెలిసిపోతుంది కానీ… రాబోయే కాలంలో ఓ చిక్కు ప్రశ్న మాత్రం కేసీయార్ ఎదుట నిలబడే సూచనలు మాత్రం ఉన్నాయి… అదేమిటంటే..?
బీసీలు… ఎస్, ఏ బీసీలనయితే ఇటీవల కేసీయార్ టార్గెట్ చేసి గొర్లు, బర్లు, కులవృత్తుల ఉపకరణాలు, సాయాలు ఎట్సెట్రా ప్రకటించి, తన ఓటు బ్యాంకుగా చేసుకోవాలని అనుకుంటున్నాడో వాళ్ల నుంచే చాలా ప్రశ్నలు ఎదురుకానున్నాయేమో…? 2014లో శాసనసభలో ఆర్థికమంత్రి ఈటల సమగ్రసర్వే వివరాలు చెబుతూ… 51.08 శాతం బీసీలు, 21.5 శాతం ఓసీలు (మైనారిటీలు కలిసి…) 17.5 శాతం ఎస్సీలు, 9.91 శాతం ఎస్టీలు ఉన్నారని వెల్లడించాడు… ఇప్పుడు జనాభా ప్రాతపదికన రిజర్వేషన్లు అనేది కేసీయార్ సూత్రం కాబట్టి ఆ కోణంలో ఓసారి చూద్దాం…

 • కాయితి లంబాడాలు, వాల్మీకి బోయల్ని కూడా కలిపితే ఎస్టీలు 10 శాతం అవుతారు కాబట్టి వారికి 10 శాతం రిజర్వేషన్లు… గుడ్, వోెకే
 • ఎస్సీలకు ఇప్పుడు 15 శాతం ఉన్నాయి… మరో ఒక శాతం ఇస్తామంటున్నారు కాబట్టి వారికి 16 శాతం అవుతాయనుకుందాం… అయినా జనాభాకు రెండున్నర శాతం తక్కువే…
 • ముస్లిములకు 12 శాతం రిజర్వేషన్లు చేస్తున్నారు కాబట్టి, 98 కులాలున్న ఒరిజినల్ బీసీ కులాలతో కలిపి 37 శాతం రిజర్వేషన్లు అవుతాయి… బీసీలకు ఉన్నది 25 శాతమే…
 • 12 శాతం ముస్లిములను తీసేస్తే ఇక మిగిలిన వెలమ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ తదితర అగ్రవర్ణాలు ప్లస్ క్రిస్టియన్లు, సిక్కులు, ఇతర మైనారిటీలు అందరూ కలిపి 9.5 శాతం అన్నమాట… (21.5 శాతం ఓసీలు మైనస్ 12 శాతం ముస్లింలు)…
 • ఇప్పటికి 62 శాతానికి చేరుస్తున్నారు రిజర్వేషన్లను… ఎస్సీలకు అదనంగా ఒక శాతం ఇస్తానూ అంటున్నాడు కాబట్టి అదీ కలిపేస్తే 63 శాతం…
 • ఇక అసలు చిక్కు ఎక్కడ వస్తుందీ అంటే..? మేం 51 శాతం ఉన్నాం కదా, 98 కులాలున్నాయి కదా… మరి జనాభా ప్రాతిపదికన మాకు 25 శాతమే రిజర్వేషన్లు ఎలా ఉంటాయి..? ఇదెక్కడి న్యాయం..? అంటే బీసీలకు అన్యాయం జరగడం లేదా అనేది బీసీల నుంచి ఎదురవుతున్న ప్రశ్న…
 • నిన్న శాసనసభలో బీసీ కృష్ణయ్య ప్రసంగంలోని ఈ అంశం బీసీల్లోకి బలంగానే వెళ్లింది…
 • నేను త్వరలో బీసీ కమిషన్ నుంచి ఆ రిపోర్టు కూడా తెప్పించుకుని వాళ్లకూ రిజర్వేషన్లు పెంచేస్తాను అంటున్నాడు కేసీయార్… సరే, అభినందనీయం… అంటే జనాభా ప్రాతిపదికన మరో 26 శాతం పెంచాలన్నమాట… స్థూలంగా అప్పుడు మొత్తం రిజర్వేషన్ల శాతం 89 శాతానికి చేరుతుంది… (ఇప్పటి 62 + ఎస్సీలకు అదనం + బీసీలకు అదనం 26)
 • 89 శాతం రిజర్వేషన్లు ఇస్తే, ఇక మిగిలేది 11 శాతం… నమ్మశక్యంగా ఉందా..? కేంద్రం గానీ, సుప్రీం గానీ అంగీకరిస్తాయా..? అసలు 89 శాతం రిజర్వేషన్లు ఇచ్చేశాక ఇక వాస్తవంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే స్ఫూర్తి ఏం మిగిలినట్టు..?
 • సరే, బీసీలకు కూడా న్యాయం చేయాలని అనుకుంటే, సమగ్రసర్వే వివరాలతో ఇప్పుడే ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్న బీసీల నుంచి అప్పుడే బలంగా ఎదురవుతున్నది… ఒకవేళ ఏ ఆరు నెలలకో ఇదీ చేయాలని అనుకున్నా సరే, కోర్టు గొడవలు, కేంద్రం తిరస్కృతితో ఇప్పుడిచ్చిన అదనపు రిజర్వేషన్లే ఆగిపోయే స్థితి ఉంటే…? అప్పుడు బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అనే అంశాన్ని ప్రభుత్వం చేపడుతుందా..?

ఇదుగో ఇక్కడ కేసీయార్‌కు బీసీల నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది… బీసీలకు సంబంధించి భవిష్యత్తులో ఏమీ చేయకపోతే మాత్రం… ‘‘మాకు న్యాయం చేయటానికి ప్రయత్నించాడు కేసీయార్ అనే పాజిటివిటీ ఎస్టీలు, ముస్లిముల నుంచి వ్యక్తమైనా… అది తనకు ఉపయోగపడినా… తమకు మాత్రం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేదు అనే భావన బీసీల్లో అసంతృప్తికి గురిచేసే ప్రమాదముంది… సో, మొత్తానికి కేసీయార్ రిజర్వేషన్లు, తాజా స్థితి, విపరిణామాలు, భవిష్యత్తు చిక్కులు ఇలా ఉండనున్నాయనేది ఒక అంచనా…

మన భారత ఎన్నికల విధానంలో జరగాల్సిన మార్పులు ఏమిటి? : అల్లేని నిఖిల్

ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులూ, పార్టీలూ విడుదల చేసే మేనిఫెస్టోలలోగానీ, ప్రసంగాలలోగానీ ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు. ధారాళంగా హామీలు ఇస్తున్నారు.

     ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోవడం సర్వసాధారణమైంది. దేశం లేదా రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తాము అధికారంలోకి వస్తే ఎలా పరిష్కరిస్తారో సవివరంగా చెప్పడానికి ఉద్దేశించినవే మ్యానిఫెస్టోలు.అలాంటి మ్యానిఫెస్టోలు కాగితాలకే పరిమితమైపోతున్నాయి. మ్యానిఫెస్టోలు ఇచ్చే హామీలకు రాజకీయ పార్టీలను జవాబుదారీగా చేయాలి. దురదృష్టవశాత్తు మన దేశంలో జరుగుతున్నది వేరు. అలవిగాని హామీలన్నీ ఇచ్చి ఓట్లు దండుకోవడం… అధికారంలోకి వచ్చాక మాట మార్చడం, కుంటిసాకులు చెప్పడం అలవాటు అయ్యింది. ఎందుకంటే… ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే పార్టీలను జవాబుదారీ చేసే చట్టాలేమీ లేకపోవడం, ఫలితంగానే ఎన్నికలకు ముందు పార్టీలు ఇచ్చే హామీలు కోటలు దాటుతున్నాయి. ఆచరణకు వస్తే అంగుళం కదలడం లేదు. 

మన దేశంలో ఈ దిశగా జరగాల్సిన మార్పులు….

►అధికారంలోకి వచ్చాక మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే… శిక్షార్హమైన నేరంగా పరిగణించాలి. ఈ మేరకు చట్టాలు చేయాలి. మాటతప్పే పార్టీలపై కోర్టుల్లో పిల్‌ వేసే అవకాశం కల్పించాలి. అప్పుడే మోసపూరిత హామీలకు అడ్డుకట్ట పడుతుంది.

►ఉచిత హామీలను అనుమతించకూడదు. అధికారంలోకి రావడమే పరమావధిగా రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా ఉచిత హామీలు, రుణమాఫీ హామీలు ఇవ్వడం మూలంగా రాష్ట్రాలు తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి.

► ఏ హామీ అమలుకు ఎంత డబ్బు అవసరమవుతుంది… దాన్ని ఎలా సమకూర్చుతారనేది మ్యానిఫెస్టోలోనే స్పష్టంగా చెప్పడం తప్పనిసరి చేయాలి.. దీనిమూలంగా అలవిగాని హామీలను నిరోధించొచ్చు.

►ఏ హామీని ఎప్పటిలోగా చేస్తారో నిర్దిష్ట కాలపరిమితిని చెప్పాలి.

► అలాగే ఏదైనా పథకాన్ని ఎంతమందికి వర్తింపజేస్తారో స్థూలంగా ఒక సంఖ్యను చెప్పాలి. (లేకపోతే ఏ వంద మందికో లబ్ధి చేకూర్చి తన ఎన్నికల హామీ అమలు చేశామని పార్టీలు చేతులు దులుపుకునే అవకాశాలుంటాయి.)

►పార్టీల మ్యానిఫెస్టోల తయారీలో, సంబంధిత రంగానికి చెందిన నిపుణులతో విస్తృతంగా చర్చించి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి.

► వీటిని ప్రజా వేదికలపై చర్చించాలి.

►పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలను ఈసీ వద్ద రిజిస్టర్‌ చేయాలి. అలాగే మ్యానిఫెస్టోలు, అందులో చెప్పిన విషయాల అమలులో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాకే మ్యానిఫెస్టోల విడుదలకు ఎన్నికల కమిషన్‌ అనుమతించే విధానం అమలు చేయాలి.

    ఎన్నికల్లో ధనప్రవాహానికి అడ్డుకట్ట వేయడం, రాజకీయాలు నేరమయం కాకుండా చూడటం, పార్టీ ఫిరాయింపులు… తదితర అంశాలతో పాటు మెనిఫెస్టోకు పార్టీలను జవాబుదారీ చేసే అంశంపైనా విస్లృతంగా చర్చ జరగాలి. ప్రజాస్వామ్యం అపహస్యం కాకుండా చూడాలి. మెనిఫెస్టోలో ఆచరణ సాధ్యమైన హామీలనే పార్టీలు ఇచ్చే పరిస్థితి రావాలి.

    ప్రస్తుత ఎన్నికల ప్రక్రియలో ఈ మార్పులు రానంత కాలం ఎన్నికల హామీల పరిష్కారాన్ని పార్టీలు పెద్ద  అంశంగా  పరిగణించవు.
         ధనబలానికి చోటు లేకుండా ఎన్నికల సంస్కరణలు చేపట్టాలి. ఎన్నికల్లో పోటీ చేయడం లాభాపేక్షతో పెట్టే పెట్టుబడిగా అభ్యర్థులు భావించకూడదు. నేరపూరత చర్యలకు ఎన్నికల్లో స్థానం లేకుండా చూడాలి. ఓటర్లు కూడా అభ్యర్థుల నైతిక ప్రవర్తన, విశ్వసనీయత ఆధారంగానే ఓటు వేయాలి. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన పట్టాభిషేకం జరుగుతుంది.

ఇట్లు

మీ అల్లేని నిఖిల్

(ఒక సామాన్య భారత పౌరుడు)

Facebook: https://m.facebook.com/profile.php?id=1202266923126550

నోట్:- పైన పేర్కొన్న విషయాలు ఏ ఒక్క రాజకీయ పార్టీని గారి, ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కానీ ఉద్దేశించి రాసినది కాదు.

తెలంగాణ ప్రభుత్వం తీసుకువస్తున్న సర్వీస్ గ్యారంటీ చట్టం పాలనా సంస్కరణల్లో పెద్ద ముందడుగు: లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అల్లేని నిఖిల్


          హక్కుగా పౌర సేవల చట్టం(సర్వీస్ గ్యారెంటీ) తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచన పాలనా సంస్కరణల్లో ఒక పెద్ద ముందడుగు అని, ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వాన్ని లోక్ సత్తా అభినందిస్తూ, చట్టాన్ని స్వాగతిస్తుందని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అల్లేని నిఖిల్ అన్నారు.

                       

       ఆయన మాట్లాడుతూ లోక్ సత్తా గత ఇరవై(20) సంవత్సరాలుగా కోరుతున్న సంస్కరణ నేటికి అమలయ్యే విధంగా ఉందని అన్నారు.1997 లో లోక్ సత్తా ఆవిర్భవించగానే మొదట “స్వరాజ్యం” “పౌర హక్కుల సేవల చట్టం(సర్వీస్ గ్యారంటీ)” పేరుతో ఒక పుస్తకాన్ని ప్రచురించి 1998లో అప్పటి రాష్ట్ర గవర్నర్ రంగరాజన్ తో అవిష్కరించిందని అయన గుర్తు చేశారు

         

      లంచం లేకుండా ప్రజలకు హక్కుగా అందాల్సిన సేవలను ప్రభుత్వం అందించాలంటే ఆయా సేవలకు నిర్దిష్ట కాలపరిమితి విదించి, కాల పరిమితి దాటితే ప్రభుత్వ అధికారులకు జరిమానా విదించి ఆ జరిమానాను దరఖాస్తుదారునికి అందించాలని, విధి నిర్వహణలో ఆలస్యం చేసిన అధికారులపై శాఖాపరమైన చర్యలుండాలని అప్పుడే కోరామన్నారు.

          చట్టం తయారు చేయడానికి ప్రఖ్యాత నల్సార్ యూనివర్సిటీని ఎంచుకోవడం మంచిదేనని, ఇప్పటికే లోక్ సత్తా ఇలాంటి మోడల్ చట్టాన్ని తయారుచేసి డ్రాఫ్ట్ కాపీని ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, పార్లమెంట్ సభ్యులతో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా పంపిందని నిఖిల్ అన్నారు.
           చట్టం తయారీకి లోక్ సత్తా సహకరిస్తుందని, ఇప్పటికే లోక్ సత్తా తయారుచేసిన చట్టాన్ని ప్రభుత్వం ఒకసారి పరిశీలించాలని అయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

        పట్టాదారు పాస్ బుక్,రేషన్ కార్డు, విద్యార్థుల సర్టిఫికెట్లు, ఇలా పౌరులకు హక్కుగా అందాల్సిన అన్ని సేవలను ఇందులో క్రోడీకరించి, వాటిని సకాలంలో అందించకపోతే జరిమానా విదించే చట్టంగా ఇది ఉండాలని ఆయన అన్నారు.

       ఇలాంటి చట్టాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే కేంద్రీకృత చట్టం కావాలన్నారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆక్ట్(RTI) లాగా, రైట్ టు సర్వీస్ ఆక్ట్ (RTS) తీసుకువస్తే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇందులోకి వస్తాయని, ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలంటే ఈ చట్టం చాలా అవసరమని నిఖిల్ అన్నారు.

రైతు సమస్యలను గాలికొదిలేసిన తెలంగాణ సర్కారు : లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అల్లేని నిఖిల్

​రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అల్లేని నిఖిల్ విమర్శించారు.ఆయన మాట్లాడుతూ అసలే ఐదు సంవత్సరాలు కరువుతో అల్లాడిపోయిన రైతులపై దేవుడు కనికరించి ఈ ఒక్క సంవత్సరం పంటలు బాగా పండితే….. అది అమ్ముకోవడానికి రైతులు నానా కష్టాలు పడుతున్నారు.మరికొందరు రైతులు ఏమి చెయ్యాలో అర్ధంకాని పరిస్థితులలో కష్టపడి పండించిన పంట అంతా కొందరు దళారుల చేతుల్లో పెట్టాల్సి వస్తుంది.అన్నం పెట్టే దేవుడు,మా పంట కొనండి సారూ అని ఒక అధికారి కాళ్ళ మీద పడి కన్నీళ్ళు కార్చడం అత్యంత సిగ్గుపడాల్సిన విషయం.కానీ ఏదో ఒకరోజు వారి కన్నీళ్ళ ప్రవాహంలో ఈ అవకాశవాద రాజకీయ నాయకులు ఖచ్చితంగా కొట్టుకుపోతారు.అలాంటి రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం అని అన్నారు.

రైతు సమస్యలను గాలికొదిలేసిన తెలంగాణ సర్కారు : లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అల్లేని నిఖిల్

​రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర కార్యదర్శి అల్లేని నిఖిల్ విమర్శించారు.ఆయన మాట్లాడుతూ అసలే ఐదు సంవత్సరాలు కరువుతో అల్లాడిపోయిన రైతులపై దేవుడు కనికరించి ఈ ఒక్క సంవత్సరం పంటలు బాగా పండితే….. అది అమ్ముకోవడానికి రైతులు నానా కష్టాలు పడుతున్నారు.మరికొందరు రైతులు ఏమి చెయ్యాలో అర్ధంకాని పరిస్థితులలో కష్టపడి పండించిన పంట అంతా కొందరు దళారుల చేతుల్లో పెట్టాల్సి వస్తుంది.అన్నం పెట్టే దేవుడు,మా పంట కొనండి సారూ అని ఒక అధికారి కాళ్ళ మీద పడి కన్నీళ్ళు కార్చడం అత్యంత సిగ్గుపడాల్సిన విషయం.కానీ ఏదో ఒకరోజు వారి కన్నీళ్ళ ప్రవాహంలో ఈ అవకాశవాద రాజకీయ నాయకులు ఖచ్చితంగా కొట్టుకుపోతారు.అలాంటి రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరం అని అన్నారు.