బీసీ రిజర్వేషన్లే కేసీయార్‌కు ఎదురుకాబోయే అసలు చిక్కు..!! : నిఖిల్ అల్లేని

జనాభా ప్రాతిపదికన, అందరికీ రిజర్వేషన్లు ఇచ్చేస్తే ఇక రిజర్వేషన్లు అనే స్ఫూర్తి ఎక్కడిది..? నిజంగా సామాజికంగా వెనుకబాటుతనంలో ఉన్నవారిని ఉద్ధరించాలంటే రాజకీయ రిజర్వేషన్లు కావాలి… అవిచ్చే స్ఫూర్తి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి పదవుల్లో ఇవే శాతం రిజర్వేషన్లు పాటిస్తారా…… ఇదీ మేధావివర్గం ప్రశ్న… కాసేపు వదిలేయండి

ముస్లిం రిజర్వేషన్లు అని మేనిఫెస్టోలోనే పెట్టారు, 170 సభల్లోనూ అదే చెప్పానంటున్నారు… మళ్లీ ఇవి మతపరమైన రిజర్వేషన్లు కావంటారు… ఉన్నవాటినే పెంచుతున్నామంటారు… ఇదేమి తర్కం..? పైగా ఇది రాజ్యాంగవిరుద్ధం……. ఇదీ బీజేపీ విమర్శ… కాసేపు వదిలేయండి
ముస్లిములకు, గిరిజనులకు వాళ్ల జనాభాను బట్టి రిజర్వేషన్లు పెంచుతున్నావు సరే… మరిన్నాళ్లూ ఏం చేశావు..? వోకే, పనిలోపనిగా బీసీలకు కూడా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల బిల్లు ఎందుకు పెట్టలేదు..? యమర్జెంటుగా సుధీర్ కమిషన్, బీసీ కమిషన్ రిపోర్టులను తెప్పించి, వాటిని ముందే బయట పెట్టకుండా అప్పటికప్పుడు ఆమోదించి, రిజర్వేషన్ల బిల్లు పెట్టావు… మరి బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై ఆ వేగం, స్పీడ్ ఎందుకు లేవు..? ఆ మిస్టరీ ఏంటి..?….. ఇదీ కాంగ్రెస్ ఎదురుదాడి… కాసేపు వదిలేయండి
అణగదొక్కబడిన వర్గాలకు రిజర్వేషన్లతో చేయూతనిస్తే, అభినందించాల్సిందిపోయి, ముందే అడ్డం పడతారా..? ఇదెక్కడి చోద్యం..?……. ఇదీ టీఆర్ఎస్ వర్గాల సమర్థన… కాసేపు వదిలేయండి
సుప్రీం కోర్టు ఆల్రెడీ 50 శాతం గరిష్ట పరిమితి పెట్టేసింది… కేంద్రమూ ఒప్పుకోదు… కోర్టుల్లో నిలవదని తెలిసీ ఈ ప్రయత్నాలు కేవలం రాజకీయ లబ్ధి కోసం గాక ఇంకెందుకు..? ఇన్నాళ్లూ లేని దృష్టి ఇప్పుడు ఎందుకు అకస్మాత్తుగా ఈ గిరిజన, ముస్లిం రిజర్వేషన్లపై పడింది..?….. ఇదీ విశ్లేషకులు కొందరి మాట… కాసేపు వదిలేయండి
……….. దీనివల్ల కేసీయార్ కలిగే రాజకీయలబ్ధి ఏమిటీ..? ప్రజల్లో స్పందన ఎలా ఉంది… అని కొద్దిరోజులాగా కేసీయార్ సర్వే చేయించుకుంటే అదే తెలిసిపోతుంది కానీ… రాబోయే కాలంలో ఓ చిక్కు ప్రశ్న మాత్రం కేసీయార్ ఎదుట నిలబడే సూచనలు మాత్రం ఉన్నాయి… అదేమిటంటే..?
బీసీలు… ఎస్, ఏ బీసీలనయితే ఇటీవల కేసీయార్ టార్గెట్ చేసి గొర్లు, బర్లు, కులవృత్తుల ఉపకరణాలు, సాయాలు ఎట్సెట్రా ప్రకటించి, తన ఓటు బ్యాంకుగా చేసుకోవాలని అనుకుంటున్నాడో వాళ్ల నుంచే చాలా ప్రశ్నలు ఎదురుకానున్నాయేమో…? 2014లో శాసనసభలో ఆర్థికమంత్రి ఈటల సమగ్రసర్వే వివరాలు చెబుతూ… 51.08 శాతం బీసీలు, 21.5 శాతం ఓసీలు (మైనారిటీలు కలిసి…) 17.5 శాతం ఎస్సీలు, 9.91 శాతం ఎస్టీలు ఉన్నారని వెల్లడించాడు… ఇప్పుడు జనాభా ప్రాతపదికన రిజర్వేషన్లు అనేది కేసీయార్ సూత్రం కాబట్టి ఆ కోణంలో ఓసారి చూద్దాం…

  • కాయితి లంబాడాలు, వాల్మీకి బోయల్ని కూడా కలిపితే ఎస్టీలు 10 శాతం అవుతారు కాబట్టి వారికి 10 శాతం రిజర్వేషన్లు… గుడ్, వోెకే
  • ఎస్సీలకు ఇప్పుడు 15 శాతం ఉన్నాయి… మరో ఒక శాతం ఇస్తామంటున్నారు కాబట్టి వారికి 16 శాతం అవుతాయనుకుందాం… అయినా జనాభాకు రెండున్నర శాతం తక్కువే…
  • ముస్లిములకు 12 శాతం రిజర్వేషన్లు చేస్తున్నారు కాబట్టి, 98 కులాలున్న ఒరిజినల్ బీసీ కులాలతో కలిపి 37 శాతం రిజర్వేషన్లు అవుతాయి… బీసీలకు ఉన్నది 25 శాతమే…
  • 12 శాతం ముస్లిములను తీసేస్తే ఇక మిగిలిన వెలమ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ తదితర అగ్రవర్ణాలు ప్లస్ క్రిస్టియన్లు, సిక్కులు, ఇతర మైనారిటీలు అందరూ కలిపి 9.5 శాతం అన్నమాట… (21.5 శాతం ఓసీలు మైనస్ 12 శాతం ముస్లింలు)…
  • ఇప్పటికి 62 శాతానికి చేరుస్తున్నారు రిజర్వేషన్లను… ఎస్సీలకు అదనంగా ఒక శాతం ఇస్తానూ అంటున్నాడు కాబట్టి అదీ కలిపేస్తే 63 శాతం…
  • ఇక అసలు చిక్కు ఎక్కడ వస్తుందీ అంటే..? మేం 51 శాతం ఉన్నాం కదా, 98 కులాలున్నాయి కదా… మరి జనాభా ప్రాతిపదికన మాకు 25 శాతమే రిజర్వేషన్లు ఎలా ఉంటాయి..? ఇదెక్కడి న్యాయం..? అంటే బీసీలకు అన్యాయం జరగడం లేదా అనేది బీసీల నుంచి ఎదురవుతున్న ప్రశ్న…
  • నిన్న శాసనసభలో బీసీ కృష్ణయ్య ప్రసంగంలోని ఈ అంశం బీసీల్లోకి బలంగానే వెళ్లింది…
  • నేను త్వరలో బీసీ కమిషన్ నుంచి ఆ రిపోర్టు కూడా తెప్పించుకుని వాళ్లకూ రిజర్వేషన్లు పెంచేస్తాను అంటున్నాడు కేసీయార్… సరే, అభినందనీయం… అంటే జనాభా ప్రాతిపదికన మరో 26 శాతం పెంచాలన్నమాట… స్థూలంగా అప్పుడు మొత్తం రిజర్వేషన్ల శాతం 89 శాతానికి చేరుతుంది… (ఇప్పటి 62 + ఎస్సీలకు అదనం + బీసీలకు అదనం 26)
  • 89 శాతం రిజర్వేషన్లు ఇస్తే, ఇక మిగిలేది 11 శాతం… నమ్మశక్యంగా ఉందా..? కేంద్రం గానీ, సుప్రీం గానీ అంగీకరిస్తాయా..? అసలు 89 శాతం రిజర్వేషన్లు ఇచ్చేశాక ఇక వాస్తవంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే స్ఫూర్తి ఏం మిగిలినట్టు..?
  • సరే, బీసీలకు కూడా న్యాయం చేయాలని అనుకుంటే, సమగ్రసర్వే వివరాలతో ఇప్పుడే ఎందుకు ఇవ్వలేదు అనే ప్రశ్న బీసీల నుంచి అప్పుడే బలంగా ఎదురవుతున్నది… ఒకవేళ ఏ ఆరు నెలలకో ఇదీ చేయాలని అనుకున్నా సరే, కోర్టు గొడవలు, కేంద్రం తిరస్కృతితో ఇప్పుడిచ్చిన అదనపు రిజర్వేషన్లే ఆగిపోయే స్థితి ఉంటే…? అప్పుడు బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అనే అంశాన్ని ప్రభుత్వం చేపడుతుందా..?

ఇదుగో ఇక్కడ కేసీయార్‌కు బీసీల నుంచి చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది… బీసీలకు సంబంధించి భవిష్యత్తులో ఏమీ చేయకపోతే మాత్రం… ‘‘మాకు న్యాయం చేయటానికి ప్రయత్నించాడు కేసీయార్ అనే పాజిటివిటీ ఎస్టీలు, ముస్లిముల నుంచి వ్యక్తమైనా… అది తనకు ఉపయోగపడినా… తమకు మాత్రం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేదు అనే భావన బీసీల్లో అసంతృప్తికి గురిచేసే ప్రమాదముంది… సో, మొత్తానికి కేసీయార్ రిజర్వేషన్లు, తాజా స్థితి, విపరిణామాలు, భవిష్యత్తు చిక్కులు ఇలా ఉండనున్నాయనేది ఒక అంచనా…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s